ఉగ్రవాదుల దాడిని ఆపే ప్రయత్నం చేశాడు: హార్స్ రైడర్ అంత్యక్రియల్లో ఒమర్ అబ్దుల్లా

  • కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి
  • పర్యాటకుడిని రక్షించే ప్రయత్నంలో స్థానికుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మృతి
  • ఆదిల్ అంత్యక్రియలకు హాజరైన సీఎం ఒమర్ అబ్దుల్లా
  • ఆదిల్ షా కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం హామీ
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో స్థానిక హార్స్ రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మృతి చెందారు. ఉగ్రవాదుల తూటాకు బలైన ఆదిల్ షా అంత్యక్రియలు ఈరోజు జరిగాయి. ఈ అంత్యక్రియలకు వందలాది మంది స్థానికులతో పాటు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆదిల్ షా ధైర్యసాహసాలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. "ఆదిల్ షా ధైర్యం ప్రదర్శించాడు. దాడిని ఆపేందుకు ప్రయత్నించి, ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని విధాలా ఆదుకుంటాం" అని  ఆదిల్ సాహసాన్ని ఒమర్ అబ్దుల్లా కొనియాడారు.

కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఆదిల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పర్యాటకుడిని రక్షించే ప్రయత్నంలో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు.

పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో, తుపాకులతో విరుచుకుపడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో పలువురు పర్యాటకులు మరణించారు. పర్యాటకులను గుర్రాలపై పార్కింగ్ స్థలం నుంచి బైసరన్ గడ్డి మైదానంలోకి తీసుకెళ్లే ఆదిల్ షా, తనతో ఉన్న పర్యాటకుడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఉగ్రవాది చేతిలోని తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నించగా, వారు ఆదిల్‌ను కాల్చి చంపినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి.

Syed Adil Hussain Shah
Jammu and Kashmir Terrorist Attack
Pahalgham Attack
Omar Abdullah
Horse Rider
Terrorism in Kashmir
Kashmir Tourism
Braveheart
Adil Shah Funeral

More Telugu News